మనుస్మృతి వచనం – తొమ్మిదింటిని దర్శించునప్పుడు వట్టి చేతులతో పోరాదు

శ్లో! అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీం వృద్ధ బాలకౌ
                               రిక్తహస్తేన నోపేయాత్, రాజానం దైవతం గురుమ్
                                                                              –మనుస్మృతి.
అగ్నిహోత్రము, స్వగృహము, పుణ్యక్షేత్రము, గర్భిణీ స్త్రీ, ముసలివారు, పిల్లలు, రాజు, దైవము, గురుడు, ముఖ్యంగా ఈ తొమ్మిదింటిని దర్శించునప్పుడు వట్టి చేతులతో పోరాదు. మధురమైనా, పండైనా, పూవునైనా తీసుకొనిపోవాలి.

                          ఆ.వె. అగ్ని కడకు, స్వగృహ, మారాధ్యదైవమ్ము
                                    సన్నిధులకు, గురుని సన్నిధికిని
                                    క్షేత్రములకు, వృద్ధ, శిశువుల చూలింత
                                    వట్టి చేత పోకు ప్రభుల జూడ
పై శ్లోకంలో చెప్పిన చోట్లకు వెళ్లొస్తాం అనగానే, ఇంట్లోని పెద్దవాళ్లు, వట్టి చేతులతో వెళ్లొద్దండి, ఏదో ఒకటి తీసుకెళ్లమంటారు. ఎందుకనవసరంగా ఖర్చు అంటుంటాం. ఎందుకు ఏదో ఒకటి తీసుకెళ్లలో తెలుసుకుందాం. అగ్నిహోత్రం, యజ్ఙ యాగాదులు జరిగేచోట వుంటుంది. అవి చూడడానికి అనేక మంది వస్తారు. తలా ఒక చేయి వేస్తే, ఆహారాది వ్యవస్థలు సరిగా వుంటాయని  తృణమో, ఫణమో సమర్పించమంటారు.
మనం ఊరెళ్లి వస్తే, ఎప్పుడొస్తారాని ఎదురు చూస్తూ, మాకోసం ఏం తెచ్చారని అడిగేస్తారు. వారిని నిరాశ పఱచకుండా, ఏదైనా ఇస్తే, ప్రేమ ఆప్యాయతలు, సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. అలాగే, గుడి, గురువు, పూజ్యుల దగ్గరకు ఎంతో మంది  వస్తారు. మనమిచ్చే పండ్లు, మధురం వాళ్లేమీ తినరుగా, అందరికీ పంచుతారు.
అలాగే, వృద్ధులకు, పిల్లలకు,  ఏదైనా తీసుకెళ్లి పంచిపెట్టడం వల్ల, వారి మానసిక ఆనందం ఇనుమడిస్తుంది. రోగులకు ధైర్యం చెప్పి, ఏమైనా ఇవ్వడంవల్ల జబ్బు త్వరగా తగ్గే అవకాశముంటుంది. ఇలా మన యోగ్యానుసారం ఏదో ఒకటి ఇవ్వాలని  పెద్దలు (శాస్త్రం) చెబుతారు.
దయచేసి, రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పంచండి

1 thought on “మనుస్మృతి వచనం – తొమ్మిదింటిని దర్శించునప్పుడు వట్టి చేతులతో పోరాదు

Leave a Reply