దేవగురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. గురుడు మేష రాశిలో ప్రవేశంతో గంగానది, వృషభం -నర్మద, మిథునం- సరస్వతీ, కర్కాటకం- యమున, సింహం-గోదావరి, కన్య-కృష్ణా, తుల-కావేరి, వృశ్చికం- తామ్రపర్ణీనది, ధనుస్సు-పుష్కర వాహిని, మకరం- తుంగ భద్ర, కుంభం-సింధు, మీనం-ప్రణీతానదులకు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలు 12 రోజుల పాటు జరుగుతాయి. ఈ పన్నెండు రోజులు నదీ స్నానాలు, దానధర్మాలు పుణ్యఫలాన్నిస్తాయి.
ఈ ఏడాది అధిక ఆషాఢ బ. త్రయోదశి మంగళవారం అనగా 14.07.15వ తేదీ ఉ.6.24 గంటలకు మఖ నక్షత్రం మొదటి పాదం సింహరాశిలో గురుడు ప్రవేశం. 14.07.2015 నుండి గోదావరి నదీ పుష్కరాలు ప్రారంభమై 25.07.2015వ తేదీ వరకు కొనసాగుతాయి.
ఈ పవిత్ర పుష్కర సమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకు, పిండ ప్రదానానికి అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. పుష్కర కాలంలో చేసే ఆయా కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి. బంగారం, వెండి, భూమి, ధనం, గోవులు, ధాన్యం, లవణం, రత్నాలు, అశ్వం, పండ్లు, బెల్లం, వస్త్రాలు, తైలం, శాకములు, తేనె, పీట, అన్నం, పుస్తకం… ఇలా ఎవరి శక్తిని బట్టి వారు రోజుకు ఒకటి లేదా రోజుకు కొన్ని చొప్పున దానం చెయ్యడం వల్ల ఈ లోకంలో సుఖసంపదలు పొందడంతోపాటు అంత్యమున ముక్తి కలుగుతుందని రుషి ప్రమాణం.
ఈ పన్నెండు రోజులు గోదావరిలో స్నానాదులు, పూజలు, దానధర్మాలతోపాటు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తే పుణ్యఫలం కలుగుతుంది. గోదావరికి ఏడాది తర్వాత అంత్యపుష్కరాలు కూడా వస్తాయి. ఈ కాలంలోనూ ఇదే విధంగా ఆచరించడం పరిపాటి. పుష్కరాలలో స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాలపాటు ఆ నదులలో నిత్యం స్నానం చేసినంత పుణ్య ఫలం లభిస్తుంది. జన్మజన్మల పాపాలు నశించి, మోక్షప్రాప్తి కలుగుతుంది.
అశ్వమేధయాగం చేసినంత ఫలం కన్న రెట్టింపు ఫలం పుష్కరస్నానం వల్ల లభిస్తుంది. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, పరమ పవిత్రమైన కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఏ నదికి పుష్కరాలు సంభవిస్తున్నాయో ఆ నదిపేరును మనం స్నానం చేసేటప్పుడు ముమ్మారు మనస్సులో తలచుకున్నా కొంతమేర పుష్కర స్నాన ఫలితం పొందొచ్చునని శాస్త్రవచనం.
పుష్కర స్నాన విధి
ముందుగా పుష్కర నదికి ప్రార్థన చేసి తీరంలో ఉండి మట్టిని మూడుసార్లు నీటిలో వేసి తరువాత సంకల్ప సహితంగా పుష్కర స్నానం చేయాలి. పితృదేవతలకు తర్పణం, తీర్థోపవాసం చేయాలి. మృత్తికా స్నానం, పుష్కర స్నానం చేసి ముక్కోటి దేవతలకు, మునులకు తర్పణ విడవాలి. మళ్లీ ప్రవాహానికి అభిముఖం గా స్నానం చేయాలి. ఆయా నదీ పుష్కరాలలో పూజలు నిర్వహించిన వారికి దీర్ఘాయుష్షు లభిస్తుందని పురాణ గాథలు విదితం చేస్తున్నాయి.
మొదటి రోజు నారాయణుని, రెండోరోజు భాస్కరుని, మూడోరోజు మహర్షులను.. ఇలా పన్నెండు రోజులపాటు 12 మంది అధిదేవతలను పూజించి చివరి రోజున 12 దానాలు చేస్తారు. ఒక్కో దానానికి ఒక్కో ఫలితం ఉంటుంది. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కో శ్రాద్ధం నిర్వహిస్తారు. తొలిరోజు హిరణ్యశ్రాద్ధం, తొమ్మిదవ రోజు అన్నశ్రాద్ధం, 12వ రోజున ఆమశ్రాద్ధం తప్పనిసరిగా నిర్వహించాలి.