మహాలయపక్షము పిండ ప్రాధాన్యత విధి విధానాలు

Shraddhaశ్రీ గురుభ్యోనమః

ఎవరో మహాలయపక్షము గురించి చర్చిస్తూ అది కర్ణుడి ద్వారా వచ్చినది అన్నట్టుగా వ్రాయడం జరిగింది, కర్ణుడి వృత్తాంతం ప్రక్షిప్తం.  ఇది నిస్సందేహం. అయితే పిండ ప్రాధాన్యత విధి విధానాలు అనే విషయాలను సాక్షాత్ వరాహ స్వామి భూదేవితో స్వయంగా చెప్పినట్టు మనకు వరాహ పురాణము తెలుపుతుంది. ఈ పురాణమునందే “నిమి” అనే ఒక సద్భ్రాహ్మణుడి చరిత్ర చెప్పడం జరుగుతుంది. వీరికి నిత్య సంధ్యావందనం లో తర్పణం వలన దేవ పితృ తర్పణ ఫలితం లభిస్తుంది అన్నది పురాణ వచనం. అయితే మనకు పెద్దలు చెప్పినట్టు దేవ కార్యము కంటే కూడా పితృకార్యము శ్రేష్టమైనది అనుటకు ప్రమాణ గ్రంధము వరాహ పురాణము. ఈ నాటి కాలంలో ఇంట్లో కుక్కలను మనుషుల కంటే కూడా ప్రేమగా ఆచరిస్తున్న నేపధ్యములో ఆ కుక్క నడయాడిన ప్రదేశము అపవిత్రమై ఆ ప్రదేశములో పెట్టిన శ్రాద్ధ కర్మ వ్యర్ధమై  పితృదేవతల శాపమునకు గురి చేస్తున్నది అని మనకు తెలియుచున్నది.

“యన్న పశ్యన్తి తే భోజ్యం శ్వానః కుక్కుట సూకరా:

బ్రాహ్మణాశ్చాప్య పాఙ్తేయానరా: సంస్కార వర్జితా:

సర్వకర్మకరా యే సర్వభక్షాశ్చ యే నరా:

నేతాన్ శ్రాద్దే న పశ్యేతపితృ యఙేషు సుందరి”

శ్రాద్ధ విధులయందు అతి ముఖ్యమైన బ్రాహ్మణ భోజన విధిని కుక్కలుగానీ, పందులుహానీ, కోళ్ళుగానీ, అపాంక్తేయులు (సహపంక్తి లో కూర్చునే అర్హత లేని వారు) సంస్కార విహీనులుగానీ చూడరాదు.

ఓ భూదేవీ, సుందరీ అన్ని పనులు చేయువారు కానీఅన్ని వస్తువులను తినువారుకానీ శ్రాద్ధ క్రియను చూడరాదు.

మరి అలాంటి అకృత్యము జరిగితే ఏమవుతుంది.

“ఏతే పశ్యంతి య: శ్రాద్ధం తత్ శ్రాద్ధం రాక్షసం విదు:

మయా ప్రకల్పితం భాగం అసురేంద్రబలే: పురా

దత్త్వా మయా తు త్రైలోక్యం శక్రస్యార్ధే త్రివిక్రమే”

ఏవం శ్రాద్ధం ప్రతీక్షిన్తి మంత్రహీన విధి క్రియామ్

వర్జనీయా బుధైరేతే పితృయఙేషు సుందరీ”

అట్లు అపవిత్రమైన శ్రాద్ధం రాక్షస విదుమౌతుంది.  పూర్వము బలి చక్రవర్తిని అడిగి ఇంద్రునకు త్రివిక్రమ రూపముతో మూడులోకముల నిచ్చితిని. ఆ విధముగా ఈ పితృయఙ ఫలము సైతము నాకే చెందును. యోగ్యవంతమైన శ్రాద్ధమును పితృదేవతలు ఎదురుచూచుచుందురు. మంత్ర, క్రియాహీనమైన శ్రాద్ధము త్యాజ్యము.

ఈ వాక్కులను బట్టి, పితృకార్య విశేషణము అవగతమగుచున్నది.

ఇక మహాలయము విశిష్టత మనకు దేవీ సప్తశతిలో కనపడుచున్నది. మహాలయము నాటి అమ్మ అవతారము తదుపరి నవరాత్ర ప్రారంభము మొ…వి.  రవి తులా సంక్రమణముని పొందు సమయమే మహాలయ పక్ష ఆరంభము అని శాస్త్రము. ఈ పక్ష ప్రారంభము నుండి పదహారు రోజులు పితృదేవతలను తృప్తిపరచవలెనని శాస్త్రము, అట్లు కానిచో పంచమి, షష్టి, అష్టమి, దశమి, ఏకాదశి మొదలుకొని అమావాస్యాంతము చేయవలెను. ఇందు కూడా అశక్తుడయినచో నిషిద్ధము కాని ఒక దినము నందు సకృన్మహాలయము చేయవలెను. ఇందు కొన్ని నిషిద్ధములను శాస్త్రము చెప్పిఉన్నది. అయితే దానికి పరిహారము సైతము సూచించడం జరిగింది.  తొలుత ఆ నిషిద్ధములు తెలుసుకుందాము.  పూర్తి పక్షమునాచరించు వారికి ఏ నిషిద్ధములేదు. అట్లుకాక పంచమి నుండి ప్రారంభించే వారు మాత్రము చతుర్డశిని విడువవలెను.  సకృన్మహాలయము కూడా చతుర్దశినాడు కూడదు. ప్రతిపత్, షష్టి, ఏకాదశి, శుక్రవారము, జన్మ నక్షత్రము, దానికి దశమము, 19 వ నక్షత్రము, రోహిణి, మఖ, రేవతియు, సకృన్మహాలయమునకు నిషిద్దములు.  ఒకవేళ సకృన్మహాలయము పితృతిధి యందు చేయుచో ఎట్టి నిషిద్దములు లేవు.  అయితే అశక్తుడైనచో అతడు చేసే ఒక్కరోజు మాత్రమే చేయును కనుక ఎటువంటి నిషిద్ధమందైనను యధావిధిగా చేసుకొనవచ్చును అని శాస్త్రము తెలుపుతున్నది.  వీటికి అన్నిటికీ కూడా ఉత్తమమైనదిగా మనకు భరణీ శ్రాద్ధము కనపడుతోంది.  భరణీ నక్షత్రమున శ్రాద్ధము గయా శ్రాద్ధ ఫలము ఇస్తుంది.

“అశక్త: పితృపక్షేషు కరోత్యేకదినే యత:

నిషిద్దేపి దినే కుర్యాత్పిండదానం యధావిధి:”

ఇలా ఎన్నో నియమాలు, వెసులుబాట్లు మనకు పూర్వీకులు అందించి ఉన్నారు. వీటన్నింటికి పైన కావాల్సింది శ్రద్ధ. పూర్వీకులపైన భక్తి.  మన వంశము నిలబడాలంటే దానికి మూలం పూర్వీకులే అన్న సంగతి మరువకూడదు. ఇతర మతములలో లాగా సంవత్సరములో ఒక్కసారి సమాధులను శుభ్రం చేసే కుసంస్కారపు మతం కాదు సనాతనం.  వారికి మన మనస్సులలో ప్రతీ నిత్యము చోటు ఇచ్చి వారి ఆత్మశాంతితో మన దైనందిన జీవన విధానమును సంతోషదాయకముగా నిలుపుకునే ఒక సంస్కార ధర్మం సనాతనం.

మల్లాది.

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.