ఈ పూలతో భగవంతుడ్ని అర్చిస్తే…. ఇలాంటి ప్రతిఫలాలు ప్రాప్తిస్తాయి

దేవునికి సమర్పించే పుష్పం ఏదైనా అది శుచి అయి, శుభ్రతతో కూడుకున్నదై ఉండాలని పెద్దలు చెబుతారు. పురిటివారు, మైలవారు, బహిష్టులయిన స్త్రీలు పుష్పాలను తాకరాదు. అలాంటి పుష్పాలు పూజకు పనికిరావు. అలాగే భూమిపై పడ్డ పుష్పాలు, వాసన చూసిన పుష్పాలు, కడిగిన పుష్పాలను పూజకు వినియోగించరాదని శాస్త్రం చెబుతోంది. శుచిగా, స్నానమాచరించిన తర్వాత కోసిన పత్ర, పుష్పాలనే దైవ పూజా కార్యక్రమాలకు ఉపయోగించాలట. వాడిపోయినవి, ముళ్ళుతో కూడుకున్నవి, అపరిశుభ్రమైనవి, దుర్గంధ పూరితమయిన పుష్పాల వినియోగం శ్రేయస్కరం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి.

తామర పువ్వులు,

కలువ పువ్వులు, జాజులు, చామంతి, నందివర్ధనములు, మందారము, నీలాంబరాలు, కనకాంబరాలు, మాలతి, పారిజాతాలు, పద్మాలు, మంకెన, మునిగోరింట, ఎర్రగన్నేరు, గరుడవర్ధనము, నిత్యమల్లి పుష్పాలు పూజలకు పవిత్రమైనవిగా చెబుతారు. సూర్యభగవానుడ్ని, విఘ్నేశ్వరుని తెల్లజిల్లేడు పుష్పాలతో పూజించాలట.

విష్ణుభగవానుడిని తులసి దళాలతో, శ్రీమహాలక్ష్మిని తామర పువ్వులతో, గాయత్రిదేవిని ‘మల్లిక’, ‘పొగడ’, ‘కుశమంజరి’, ‘మందార’, ‘మాధవి’, జిల్లేడు, ‘కదంబ’, ‘పున్నాగ’, ‘చంపక’, గరిక పుష్పాలతో పూజించాలిట. అలాగే ‘శ్రీచక్రాన్ని’ తామరపువ్వులు, తులసి దళాలు, కలవ పూలు, జాజి, మల్లె, ఎర్రగన్నేరు, ఎర్ర కలువపూలు, గురువింద పుష్పాలతో పూజించాలి. మహాశివుని మారేడు దళాలతో పూజించడంవల్ల పరమేశ్వరుడు సంతృప్తిచెంది కోరిన వరాలన్నీ నెరవేరుస్తాడంటారు.

‘మంగిషం’ పుష్పాలతో పూజ ఓర్పును, శాంతిని, సహనాన్నిస్తుంది. విరుచి పుష్పాలు – మనసుకు ప్రశాంతతను, ‘ఎరుక’ పుష్పాలు – ఆత్మస్థైర్యాన్ని, అరళి పుష్పాలు – సత్యసందతను పెంపొందిస్తాయట. అలాగే తెల్ల తామరలతో దైవాన్ని అర్చిస్తే భక్తి పెరుగుతుంది. తులసి దళాలు – ఆధ్యాత్మిక వికాసాన్ని, గన్నేరు, జీవంతి పుష్పాలు – ముక్తికి, మల్లెపుష్పాలు – నిష్కల్మషబుద్ధిని, సంపెంగ పుష్పాలు – అభివృద్ధిని, నాగలింగ పుష్పాలతో పూజిస్తే ఆర్థికాభివృద్ధి జరుగుతుందని శాస్త్ర వచనం. అలాగే ఎర్ర పుష్పాలు శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరం. ఈ పుష్పాలతో పూజవల్ల శ్రీమహాలక్ష్మి సంతుష్టురాలై, అభీష్ట సిద్ధినిస్తుంది. అలాగే తామర, శంఖ పుష్పాలతో చేసే పూజవల్ల అష్టైశ్వర్యాలు, మారేడు దళాలతో చేసే పూజవల్ల జ్ఞానాభివృద్ధి కలిగి ముక్తికలుగుతుందని శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది.

Leave a Reply