బోగిపళ్ళు
బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.
తిల తర్పణం
సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వధినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము ఇస్తారు.
సంకురుమయ / సంక్రాంతి పురుషుడు
మట్టి తో ఒక బొమ్మను (సంక్రాంతి పురుషుడు), తన వాహనాన్ని (ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాల పై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టము అని ఒక నమ్మకం) , మేళ తారళాలను చేసి, సంక్రాంతి మూడు రోజుల్లొ పూజలు చేస్తారు. నాల్గవ నాడు ఈ బొమ్మలను వాల్లాడిస్తారు.
హరిదాసు
గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయా ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని { ఉత్+దరించు= తలమీద పెట్టుకోవడం} అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం.
గంగిరెద్దు
ముందు వెనుకల చెరో ప్రమదునితో {శివ గణం} ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంభరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మభద్దమైనదని అర్ధం. “జుగోప గోరూప ధరామివోర్విం” దీని అర్ధం ఆ నేల ఆవుకి సంకేతం ఆనేలనుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మభద్దమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభసహిత శంకర పరివారం.
కొన్ని విశేషాలు
హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌరగమనాన్ని అనుసరించి వస్తుంది. గ్రెగోరియను కాలెండరు కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతీ సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి గ్రెగోరియను కాలెండరు ప్రకారం ఏటికేడాది వేరువేరు రోజుల్లో వస్తాయి.
పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.అంచేతే భారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకూ ఆగి, ఉత్తరాయణం లో రథసప్తమి (మాఘ శుద్ధ సప్తమి) నాడు ప్రారంభించి, రోజునకు ఒక్కొక్క ప్రాణం చొప్పున వదులుతూ, చివరకు భీష్మఏకాదశి మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఐదవ ప్రాణాన్ని కూడా వదిలి, తనువు చాలించాడు.
ఆది శంకరాచార్యుడు ఈరోజునే సన్యాసం పుచ్చుకున్నాడు.