ఒక శూద్రుడు ఉండేవాడు. అతనికి ‘ఆశ’ అనేదే లేదు. దొరికిన దానితో తృప్తి పడేవాడు. ఆకుకూరలు తిని, బజారులో రాలిన ఆహారపు గింజలను ఏరుకొని, పొలాలలో వదిలివేసిన వరిధాన్యపు కంకులను సేకరించుకుని బ్రతికేవాడు.అతని వద్ద పాతవి, చిరిగిన రెండు వస్త్రాలు మాత్రమే ఉండేవి. గిన్నెలు వంటి పాత్రలు కూడా ఉండేవి కావు. అయినా అతనికి పరాయి సొమ్ము మీద ఆశ లేదు.
శ్రీహరి ఆ శూద్రుడిని పరీక్షించాలని భావించి, రెండు కొత్త వస్త్రాలను తీసుకువెళ్ళి, నది వద్ద అతనికి కనిపించే విధంగా ఉంచాడు. ఆ బట్టలు చూసిన శూద్రుని మనసులో వాటిని తీసుకోవాలనే కోరిక కలుగులేదు. వాటిని చూసి, మౌనంగా వెళ్ళపోయాడు.
అప్పుడు శ్రీమహావిష్ణువు ఒక బంగారు కణికను అతనికి కనిపించేలా మరోచోట ఉంచాడు. శూద్రుడు ఆ బంగారాన్ని చూసి
“చాలు, చాలు, ఇది ఏదో కృత్రిమంగా తోస్తుంది, ఈ బంగారం తీసుకుంటే నాలో ఆశ పెరిగుతుంది. ఈ బంగారాన్ని రక్షించడంలో కష్టాలు భరించాలి. దీనివల్ల అహంకారం పెరుగుతుంది. ఆశా, లోభం ఉన్నవాడు సర్వదా నరకంలో పడి ఉండాలి. ఈ ద్రవ్యము నా ఇంట ఉంటే నా భార్య, పిల్లలకు పిచ్చెక్కుతుంది” అనుకుని ఆ బంగారాన్ని అక్కడే వదిలి తన ఇంటికి వెళ్ళి పోయాడు.
అప్పుడు శ్రీమహావిష్ణువు మరో పరీక్ష పెట్టాడు. శ్రీహరి ‘సన్యాసి’ రూపం ధరించి, ఆ శూద్రుని ఇంటి సమీపంలోకి వెళ్ళి, అక్కడి జనులతో వారియొక్క జరిగిపోయిన విషయాలు చెప్పసాగాడు. అది తెలిసిన శూద్రుని భార్య, సన్యాసి రూపంలో ఉన్న శ్రీహరి వద్దకు వచ్చి, తమ అదృష్టం గురించి ప్రశ్నించింది. అప్పుడు ఆ మాయా సన్యాసి “తల్లీ, ఈరోజు భగవంతుడు నీకు చాలా ధనం ఇచ్చాడు. కానీ నీ భర్త మూర్ఖుని వలే దానిని గడ్డిపరకలాగ వదిలివేసాడు. నీ ఇంట పిసరంత కూడా ధనం లేదు. నీ భర్త వల్ల నీకు దారిద్ర్యపుబాధ తప్పదు. ఈ విషయం ఇంటికి వెళ్ళి నీ భర్తనే అడుగు” అన్నాడు.
ఆవిడ ఇంటికి వెళ్ళి భర్తతో విషయం చెప్పింది. దానితో ఆశ్చర్యపోయిన ఆ శూద్రుడు సన్యాసి వద్దకు వచ్చాడు. అప్పుడు మాయా సన్యాసి ఆ బంగారం ఎందుకు తీసుకోలేదని అడిగాడు.
అప్పుడు శూద్రుడు మాయా సన్యాసితో “మహాత్మా! నాకు ధనం మీద కోరిక లేదు. ధనం అనేది మానవుని సంసారంలో బంధించే ఉచ్చు. ఆ ఉచ్చులో పడినవాడు ఇక ఉద్దరింపబడడు. ధనం అనేది పాపాలను కలిగిస్తుంది” అన్నాడు.అప్పుడు సన్యాసి “ధనం ఉంటే అందరూ మిత్రులవుతారు. సుఖభోగాలు, కీర్తిప్రతిష్టలు వస్తాయి. యజ్ఞాలు, దానధర్మాలు స్వర్గాన్ని సాధించిపెడతాయి. వ్రతాలు, పితృయజ్ణాలు, తీర్ధయాత్రలు ధనం లేకపోతే ఎలా చేయగలవు” అని ప్రశ్నించాడు.
అప్పుడు శూద్రుడు “మహాత్మా! కోరికలు లేనివాడు అన్ని వ్రతాలనూ ఆచరించినవాడు అవుతాడు. కోపాన్ని వీడినవాడు సమస్త తీర్ధాలనూ సేవించినవాడు అవుతాడు. దయాగుణం జపం వంటిది. సంతోషమే ధనం. అహింసావ్రతం సర్వోత్తమైన సిద్ధి. శిలోంచన వృత్తి పవిత్ర జీవనసాధనం. శాఖాహారం అమృతతుల్యం. ఉపవాసం ఉత్తమ తపస్సు వంటిది. నా వంటివాడు ఒక గవ్వను దానం చేసినా మహాదానమే. పరస్త్రీలు నాకు తల్లిలాంటివారు. పరధనం మట్టిబెడ్డ వంటిది. ఇది అంతా నేను ఆచరించే యజ్ఞం. అందుకే నేను ధనం కోరుకోవడంలేదు. బురదలో మునిగి కడుగుటకంటే దాన్ని తాకకపోవడమే మేలు” అన్నాడు.
ఆ శూద్రుడు అలా అన్న వెంటనే దేవతలు అతనిపై పూలవానలు కురిపించారు. వెంటనే ఆకాశం నుండి దివ్యవిమానం వచ్చింది. అందులోని దేవతలు శూద్రునితో “ఈ విమానంలో సత్యలోకానికి వెళ్ళి, అనంతకాల పర్యంతము దివ్యభోగాలు అనుభవించు” అన్నారు. అప్పుడు శూద్రుడు సన్యాసిని చూపుతూ “ఈ మహాత్ముడు ఎవరు? ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడిది, ఇలాంటి ప్రయత్నం ఎందుకు చేసారు?” అని అడిగాడు.
అప్పుడు సన్యాసి రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు తన రూపాన్ని చూపించి, “మహామునీ! నీ ధర్మనిష్ఠను తెలుసుకోవడానికే ఇక్కడకు వచ్చాను. నువ్వు సపరివారముగ స్వర్గానికి వెళ్ళు” అని చెప్పాడు. అప్పుడు ఆ శూద్రుడు దివ్య వస్త్రాలు, ఆభరణాలు ధరించి సపరివారంగా స్వర్గానికి వెళ్ళాడు.
(శిలోంచవృత్తి = కోతలు కోసిన తర్వాత పొలములో పడిన ధాన్యం వెన్నులను ఏరితెచ్చుకుని జీవించే వృత్తి)
(పద్మపురాణంలోని సృష్టిఖండం నుంచి గ్రహించబడినది)”ఓం నమో నారాయణాయ”
“ఓం నమో నారాయణాయ”
“ఓం నమో నారాయణాయ”