గౌతమిలో పుష్కరుడు నివసించే కాలాన్ని పుష్కరాలు అని అంటారు. అందుకే పుష్కర కాలంలో చేసే స్నానాలకు, ఇచ్చే దానాలకు మంచి ఫలితముంటుందని నమ్మకం. సాధారణ రోజుల్లో సంవత్సరం పాటు గోదావరి నదీ స్నానం ఆచరిస్తే ఎంత ఫలితముంటుందో, పుష్కరాల్లో ఒక్కసారి స్నానం చేస్తే అంతే ఫలితం దక్కుతుందని చెబుతారు. వేలకొలది మనుసుతో, వాక్కుతో, శరీరంతో చేసిన వివిధ పాపాలన్నీ పుష్కర స్నానం వల్ల తొలగుతాయని విశ్వాసం. తులాపురుష దానాలు వెయ్యి చేస్తే ఏ ఫలితం దక్కుతుందో, వంద కన్యాదానాలు చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో అంత ఫలితం పుష్కర స్నానం వల్ల లభిస్తుందని చెబుతారు.
అంతేగాకుండా పుష్కర కాలంలో చేసే దానాల వలన కలిగే ఫలితాలు అంతా ఇంతా కావు. దానాలలో సాలిగ్రామ దానం, శిలాదానం, కన్యాదానం, తిలపాత్రదానం, సరస్వతీ దానం..ఇవీ ఉత్తమమైన దానాలు. నదీ స్నానం చేసే ఇవి దానం చేస్తే ఫలితాలు ఉత్తమంగా ఉంటాయని కూడా చెబుతారు. అందుకే పుష్కరాల్లో ఏరోజున ఏ వస్తువులు దానం చేయాలో కూడా పేర్కొన్నారు.
పుష్కర దానాలు రోజుల వారీగా ఇలా ఉన్నాయి..
మొదటి రోజు …
బంగారం, వెండి, ధాన్యం, భూమి. తొలిరోజు వెండిదానం చేసిన వారు చంద్రలోకానికి వెళతారని, ధాన్యం దానం చేస్తే కుబేరుడంతటి ధనవంతులవుతారని, భూమి దానం చేసిన వారికి రాజయోగం పడుతుందని చెబుతారు.
రెండవ రోజు…
వస్త్రం, లవణం, ఆవు, రత్నాలు. వీటిలో ఏ ఒక్కటి దానం చేసిన ధన్యులవుతారని చెబుతారు.
మూడవ రోజు…
బెల్లం, కూరలు, గుర్రం, పళ్లు, ఇల్లు. మూడవ రోజు ఎంతో ఫలితాన్నిచ్చే రోజు. గంధం దానం చేసిన వారు గంధర్వలోకానికి వెళతారని, ఫలదానం చేసిన వ్యక్తి ఇంద్రపురాన్ని చేరుతారని, ఆశ్వదానం చేస్తే అశ్వనుల లోకాన్ని అందుకుంటారని, శాకదానం చేసిన వ్యక్తి ఇంద్రునితో సమానం అవుతారని కూడా చెబుతారు.
నాలుగో రోజు…
పాలు, పెరుగు, తేనె, నెయ్యి. నాలుగోరోజున నేయి దానం చేసిన వ్యక్తి దీర్ఘాయుష్షు పొందుతారని ప్రాశస్తి. తైలదానం చేస్తే నరలోకం దూరమవుతుంది. తేనే దానం చేస్తే వైకుంఠనగరాన్ని పొందుతారు. పాలు దానం చేస్తే సంపదలు పెరుగుతాయని విశ్వాసం.
ఐదవ రోజు..
ధాన్యం, గేదె,బండి,ఎద్దు,నాగలి. అయిదవ రోజున శ్రీక్రుష్ణుడిని పూజించి ధాన్య, శకట దానాలు, పాడి పశువుల దానాలు, నాగలి దానం చేయవచ్చని పురాణాలు చెబుతున్నాయి.
ఆరవ రోజు…
ఔషధం, చందనం, కర్పూరం, కస్తూరి. ఆరవ రోజున కర్పూర దానం చేస్తే లక్ష్మీపురాన్ని పొందుతారని, చందన దానం చేస్తే చంద్రలోకం పొందుతారని, ఔషధ దానం చేస్తే చక్కని ఆరోగ్యం పొందుతారని చెబుతారు.
ఏడవ రోజు…
గ్రుహం,పీఠం,పల్లకి. ఏడవ రోజున గ్రుహదానం చేస్తే ఆ వ్యక్తి ఎక్కువ కాలం గ్రుహస్తుడై ఉంటాడని, పీఠదానం చేస్తే పశువుల సింహాసనం దక్కుతుందని కూడా విశ్వాసం.
ఎనిమిదో రోజు…
గంధం చెక్క, అల్లం, పువ్వులు, దుంపలు. ఎనిమిదో రోజున పువ్వుల దానం విరివిగా చేయాలని చెబుతున్నారు. అది చేస్తే ఇంద్రుడు ఆనందిస్తారని,మల్లెపూలు దానం చేస్తే పూజ్యులవుతారని నమ్మకం. పల్లకి దానం చేస్తే దేవత్వం పొందుతారని చెబుతారు.
తొమ్మిదో రోజు…
పిండప్రదానం,దాసి, సెయ్య. తొమ్మిదవ రోజున తండ్రి సంతోషం కోసం పిండప్రదానం చేసిన వ్యక్తి సంతానవంతుడవుతాడని చెబుతారు.
పదో రోజు..
శివకేశవ పూజ, లక్ష్మీ పార్వతి పూజ కీలకం. పదవ రోజున విష్ణువును ద్రుష్టిలో పెట్టుకుని చేసిన ధర్మం ఎంతో ఫలితాన్నిస్తుందని, శివుని అభిషేకం పువ్వులతో సేవించిన వ్యక్తి శివుని చేరి ఆనందిస్తారని చెబుతారు. ఈరోజున చందనం, కర్పూరం మొదలయిన వాటితో లక్ష్మీ పూజ చేస్తే సర్వసుఖాలు పొందుతారని కూడా నమ్మకం.ఈరోజున సాలగ్రామదానం చేస్తే ఈభూమండలాన్నే దానం చేస్తే వచ్చేటంత ఫలితం దక్కుతుంది.
పదకొండో రోజు..
గజదానం. పదకొండో రోజున చేసిన స్నానం ఫలితంగా పదకొండు ఇంద్రియాల్లో చేసిన పాపాన్ని తొలగించుకోవచ్చని విశ్వాసం. ఆశ్చర్యకరమైన ఫలితాలు దక్కుతాయని కూడా చెబుతారు.
పన్నెండో రోజు..
విధి ప్రకారం స్నానం. పన్నెండో రోజున విధి ప్రకారం స్నానమాచరించిన వారికి నూరు అశ్వమేధయాగాలు చేసిన ఫలితం దక్కుతుందని కూడా చెబుతారు.