దసరా ఒక ముఖ్యమైన హిందువుల పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు.
ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది. ఈ రోజు ప్రజలు ఒక ప్రదేశంలో కూడి వేడుక జరుపుకుంటారు.జమ్మి చెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.
దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య కి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.
విజయదశమి (దసరా)రోజు ఈ కింది శ్లోకాన్ని పటిస్తే సకలశుబాలు కలుగుతాయి. ఈ శ్లోకాన్ని రోజు పటించిన కోరుకున్న కోరికలు తీరుతాయి.
“శమి శమయతె పాపం శమి శత్రువినాశనం ఆర్జునస్య ధనుద్దారి రామస్య ప్రియదర్శనం”.
దశహర అనే సoస్కృత పదం క్రమంగా దసరాగా మారింది. మనలోని పది అవగుణాలను హరించేది ఈ “దశహర” పoడుగ.
కామ (Lust), క్రోధ (Anger), మోహ (Attachment), లోభ (Greed), మద (Over Pride), మాత్సర్య (Jealousy), స్వార్థ (Selfishness), అన్యాయ (Injustice), అమానవత్వ (Cruelty), అహంకార (Ego)
ఈపది దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కనుక దీనిని “విజయదశమి” అనికూడా అంటారు.
దసరా రోజున వెండితో చేసిన లక్ష్మీదేవి, వినాయకుడు ప్రతిమను తెచ్చుకుంటే ఎంతో శుభమని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.