పరమ పావనమైన ధనుర్మాస వేళలో వచ్చేటటువంటి దివ్యమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా, ముక్కోటి ఏకాదశిగా వ్యవహరింపబడుతున్నది. ఈ పావనమైన ఏకాదశీ పర్వం ప్రతి మాసములోనూ సార్థకమైనప్పటికీ కూడా కొన్ని కొన్ని మాసాలలో ఒక ప్రత్యేకత దీనికి ఉన్నది. ఆ ప్రత్యేకత ప్రకారంగా ఈనాడు ఉన్నటువంటి విశేషం ఏమిటంటే వైకుంఠం యొక్క ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి అని. అందుకే ప్రతి విష్ణ్వాలయంలో కూడా ఉత్తరం వైపు ఒక ద్వారం ఉంటుంది. అది ఈరోజునే తెరుస్తారు. తిరుమల వేంకటేశ్వరుడు మొదలుకొని ప్రతి విష్ణ్వాలయంలోనూ మన దక్షిణాదిలో ఆ ద్వారములు తెరవడం అనేది ఒక ప్రసిద్దిగా జరుగుతున్నటువంటి అంశం ఇది. ఉత్తరం వైపు ద్వారం దీనికి వైకుంఠ ద్వారము అని పేరు కూడా ఉన్నది. జయ విజయులు ఇక్కడ కాపలాగా ఉంటారుట. మనకు పురాణములయందు కూడాను జయవిజయులు కాపలాగా ఉన్న ద్వారం వైపు వెళుతూ సనకసనందనాదులు ఆ సమయంలోనే అక్కడ జయవిజయులు అవరోధించినప్పుడు వారిని శపించడం ఈ కథ కనపడుతూన్నది. అందుకు జయవిజయులు కాపలాగా ఉన్నటువంటి ద్వారము ఉత్తర ద్వారము.
ఈరోజు విష్ణుపూజ విశేషమైన ఫలాలనిస్తుంది. ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని భావిస్తాం. సౌరశక్తి ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ఏకాదశి ఇది. దీనిని చాలా మహిమ గలిగిన ఏకాదశిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. ఏకాదశి ముందు రోజు ఒంటిపూట భోజనం చేసి, ఏకాదశినాడు శక్తి కొలది ఉపవసించాలి. ఆ రోజు షోడశోపచారములతో శ్రీమన్నారాయణుని పూజించాలి. ద్వాదశి నాడు మరలా పూజ చేసి అన్నాదికాలు నివేదించి, పారణ చేయాలి.
ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహ మపరేహని!
భోక్ష్యామి పుండరీకాక్ష! శరణం మే భవాచ్యుత!!
అనే మంత్రాన్ని చెప్పి దేవునికి పుష్పాంజలిని సమర్పించాలి.