యథానదీనదాః సర్వేసాగరేయాంతి సంస్థితిం
తదైవాశ్రమిణః సర్వేగృహస్థేయాన్తి సంస్థితిం
అని అన్నట్లుగా నదీ నదాలు ఎలా సముద్రుని ఆశ్రయించి ఉంటాయో, ఇతర ఆశ్రమ
వాసులందరూ గృహస్థుని ఆశ్రయించి ఉంటారు కాబట్టి గృహస్థు శ్రేష్ఠుడు
తస్మాదేతాః సదాభ్యర్చా భూషణాచ్ఛాదనాశనైః
భూతకామైః నరైర్నిత్యం సత్కారే షూత్కవేషుచ
స్త్రీలనెప్పుడూ వస్త్రాభరణములచే గౌరవించాలి. సత్కారములు, ఉత్సవములు,
గౌరవము సంపదనాశించువారు స్త్రీలను ఎప్పుడూ గౌరవించవలెను.
దయాలజ్జాక్షమాశ్రద్ధాప్రజ్ఙత్యా
గః కృతజ్ఙతా
ఏతేయస్యగుణాస్సన్తి గృహస్థోముఖ్య ఉచ్యతే
ప్రతి గృహస్థు ఈ ఏడు ముఖ్య గుణములను కలిగి పెంపొందించుకుంటూ ఉండాలి
౧) దయ: సర్వ ప్రాణుల యందు దయ కలిగి సమ దృష్టి కలిగి ఉండాలి
౨) లజ్జ సిగ్గుపడుట, తనకేమీ తెలియదని తాను చేసిన గొప్ప పనులు కూడా
అందరికీ గొప్పగా మేలు చేయలేకపోతున్నాయనీ, చేస్తున్నదానికన్నా గొప్పగా
చేయలేకపోతున్నాననీ సిగ్గుపడాలి
౩) క్షమ: ఓర్పు ఏ కార్యాన్నీ తొందర పడి చేయకుండా, ఫలితము రాలేదని త్వరపడి
ఎవరేమన్నా ఓర్పు చెంది ఉండటం ముఖ్యము
౪) శ్రద్ధ చేసే ప్రతి కార్యమునందు సంపూర్ణ విశ్వాసముతో చేయగలగాలి లేకున్న
శ్రద్ధ తగ్గి కార్యం నెరవేరదు
౫) ప్రజ్ఙ: బుద్ధి విశేషము, బుద్ధివల్ల కలిగే ఊహలనే ప్రజ్ఙ అంటారు.
ప్రజ్ఙ దైవదత్తము, దైవానుగ్రహమున్నపుడే ప్రజ్ఙ భాసిస్తుంది. కాబట్టి మన
బుద్ధిని ప్రచోదనం చెయ్యమని భగవంతుని రోజూ ప్రార్థించాలి.
౬) త్యాగం: సంపాదించిన సంపాదనలో కొంత త్యజించుట, తనకున్న దానిలో లోభత్వము
లేకుండా దాన ధర్మాలు చేయడం.
౭) కృతజ్ఙత: చేసిన మేలును మరువక గుర్తుంచుకొని ప్రవర్తించుటను కృతజ్ఙత
అంటారు.
పై ఏడు గుణములు కలిగి ప్రవర్తించుట గృహస్థు ముఖ్యమైనవి, అలవర్చుకోవలసినవి
దయా సర్వభూతేషు క్షాన్తిరనసూయాశౌచమనా
యాసో మంగళమకార్పణ్యమస్పృహేత్యాదికుర్యాత్
న్యాయాగత ధనేన కర్మాణికుర్యాత్
విహితాకరణే ప్రతిషిద్ధసేవనే నరకపాతః
దయాగుణాన్ని అలవర్చుకోవాలి, క్షాంతి లేదా క్షమ లేదా
ఓర్పునుఅలవర్చుకోవాల్, ఇతరులలోని సద్గుణములకు అసూయ చెందరాదు., శారీరక
మానసిక శౌచముకలిగి ఉండాలి, శారీరకముగానూ మానసికముగానూ అనాయాసము కలిగి
కార్యోన్ముఖుడై ఉండాలి, శుభకరమైన మంగళ కరమైన పనులు చేయాలి, యోగ్యులకు
శక్తికొలదీ భక్తితో దానాదులు ఇచ్చుగుణము ఉండాలి, ఇతరుల సంపద యందు స్పృహ
లేక ఉండాలి.
న్యాయ మార్గమున సంపాదించిన ధనముచేతనే సత్కర్మలాచరించాలి
విహితకర్మలను వదిలి అవిహిత కర్మలను ఆచరించుట నరకహేతువు.
ఆయుర్విత్తం గృహచ్చిద్రం మంత్రమౌషధ సంగమం
దానమానావమానాని నవగోప్యాని కారయేత్
ఆయుష్షు, సంపద, ఇంటి బాధలు, తాను చేసే రహస్యమైన ఆలోచనలు, తాను వాడే
మందులు, భార్యాభర్తల సంగమ విషయాలు, చేయు దానములు, తనకు జరిగిన అవమానము
పొందిన గౌరవము అను తొమ్మిదింటిని గృహస్థుడైనవాడు వెల్లడి చేయారాదు.
ఇక గృహస్థుయొక్క గృహం అంటే భార్య కూడా అటువంటి గుణములతోనే గృహస్థుని
అనుసరించాలి
ధర్మోమిత్రం ప్రమీతస్య, విద్యామిత్రం ప్రవాసినః
భార్యామిత్రం గృహస్థస్య, దానం మిత్రం మరిష్యతః
భార్య గృహస్థునకు పరమ మిత్రురాలు, ఒక మిత్రుని లాగా యుక్తాయుక్తములెరిగి
అటువంటివిషయములను భర్తకు చెప్పగలిగినదై ఉండాలి.
అనుకూల్యం కళత్రస్య స్వర్గోభవతి నిశ్చితః
ప్రాతికూల్యం కళత్రస్య నర్కోనాత్ర సంశయః
పైన చెప్పిన మానసిక గుణములను అలవర్చుకున్నవారై అనుకూలవతి యైన భార్యకలవారి
జీవితము స్వర్గతుల్యంగా ఉంటుంది. ఇంకోటి చెప్పనేలా………..!!!!!!!
అనుకూలా సదాహ్రష్టా, దక్షా సాధ్వీ ప్రజాపతీ
ఏఖరేవ గుణైర్యుక్తాశ్రరేన స్త్రినసంశయః
దయ మొదలగు పైన చెప్పిన 8-9 గుణములు నేర్చినదై భర్తకు అనుకూలముగా ఉండి,
భర్త తన నిష్ఠ, ధర్మమునందు వైక్లవ్యము పొందకుండా కాపుకాస్తూ, తానూ తన
భర్తచేత అలానే కాపుకాయబడుతూ, ఎప్పుడూ సంతోషంతో ఉండి, మంచి నేర్పరియై,
సాధ్వియై ( తన భర్తకే చెంది, తన భర్త, వంశ ఉన్నతిని మాత్రమే
కాంక్షించునదై), సంతానవతియై యున్న స్త్రీ నిజముగ శ్రయనగ అగును అంటే
లక్ష్మీదేవియే అని కీర్తింపబడుతుంది. అప్పుడే ఆయింటి స్త్రీ గృహలక్ష్మి
అని పిలిపించుకొనుటకు అర్హత కలిగి యుండును.