పరమేశ్వరుడు…పార్వతి సమేతంగా ఈ భువిపైనే ఉన్నాడు. మనముంటున్న ఈ భూమిపైనే ఆయన కూడా మన కోసం నివాసముంటున్నాడు. ఇక్కడే ఈ గాలిలో, ఈ నేలలో ఈ మట్టిపైనే ఉంటూ భక్తుల్ని సాక్షాత్కరిస్తున్నాడు. అవును మీరు వింటున్నది అక్షరాలా నిజం. శివుడి కైలాసం భూమిని దాటి మరెక్కడో ఆకాశంలోనో లేదా మరో లోకంలోనో లేదు. ఆయన కైలాసం ఇక్కడే ఉంది. మన దేశానికి కూతవేటు దూరంలో ఉంది. చైనా ఆక్రమిత, టిబెట్‌లోని హిమాలయ పార్వత సానువుల్లో సిద్ధ పురుషులకు ఆవాసమైన మంచుకొండల నడుమ ఉంది.
బ్రహ్మ లోకానికి, వైకుంఠానికి, స్వర్గలోకం లాంటి ఇతర దివ్యలోకాలకి జీవించి ఉండగా వెళ్లడం సాధ్యం అవుతుందో లేదో కాని, కైలాసాన్ని మాత్రం బతికి ఉండగానే దర్శించి రావచ్చు. శివుని కైలాసం ఉన్నది మరెక్కడో కాదు హిమాలయా పర్వతాల్లో. హిందూ మత విశ్వాసాల ప్రకారం లయకారుడు శివుడు హిమాలయాల్లోని కైలాస పర్వత శిఖర భాగాన నివశిస్తాడు. పార్వతీ సమేతుడై నిరంతర ధ్యాన స్థితిలో ఉంటాడు.
సముద్ర మట్టానికి 21,778 అడుగుల (6,638 మీటర్లు) ఎత్తులో టిబెట్ భూభాగంలో ఉన్న హిమాలయా పర్వత శ్రేణుల్లో ఈ కైలాస పర్వతం (మౌంట్ కైలాస్) ఉంది. ఈ పర్వతంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు. ఆసియాలో పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లజ్, కర్నాలి (గంగానదికి ఉపనది) మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి. హిందువులు, బౌద్ధులు, జైనులు, బాన్ మతస్థులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
మౌంట్ కైలాస్ మామూలు పర్వతం కాదు. హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని విశిష్టతలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. మానస మేథస్సుకు ఇసమంతైనా అర్థంకాని రహస్యాలు ఎన్నోఈ పర్వతంపై దాగి ఉన్నాయి. కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో ఉంటుంది. నాలుగు రంగుల్లో ఇది దర్శనమిస్తుంది. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతిభక్తునికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం, వినాయక, కుమారస్వామి, నంది ల దర్శనం కలుగుతుంది.
కైలాస పర్వత పాదపీఠంలో నెలకొని ఉన్న మానస సరోవరం మరో అపురూపం.అత్యద్భుతం. స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దం. బ్రహ్మీ ముహుర్తంలో అంటే ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తాడని భక్తుల విశ్వాసం. ఈ ముహూర్తంలో కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించటం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే. ఈ సరస్సు చుట్టుపక్కల ఉండే గృహల్లో మునులు వేలాది సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారు. మానస సరోవర ప్రాంతంలో ఎన్నో ఔషధ విలువలు ఉన్న మొక్కలు మనకు కనిపిస్తాయి.