మహా శివరాత్రి ఆవశ్యకత – సుస్వరుడి కథ

మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే మహా శివరాత్రి.

శివరాత్రి దినాన శివుని లింగ రూపంలో – “లింగోద్భవ మూర్తి” లేక “జ్యోతిర్లింగరూపం” లో పూజిస్తారు. లింగం తేజో రూపం. దీనికి ఆది,అంతం లేదు. నిర్గుణుడూ, అరూపుడూ అయిన ఆ తేజోమూర్తి రూపమే లింగం.

శివరాత్రి తో సంబంధించిన ఎన్నో కధలు ఉన్నాయి. శివోభావం, లింగోద్భవం, శివతాండవ ఆద్యం, కాలకూట సేవనం, బిల్వ పత్రాల యొక్క గొప్పతనాన్ని చెప్పే వేటగాని కధ తదితరులు.

మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు అంపశయ్య మీద ఉండగా చేసిన ధర్మప్రసంగాలలో చిత్రభానుమహారాజు చేసిన మహాశివరాత్రి దీక్ష గురించి వివరించాడు. ఆ కధ – “ఒకానొక కాలంలో జంబూద్వీపం సమస్తమునూ ఇక్ష్వాకు మహారాజు చిత్రభానుడు పరిపాలించేవాడు. ఒక మహాశివరాత్రినాడు అతడు, అతడి భార్య కలిసి ఉపవాసము ఆచరిన్చుతున్న సమయములో వారి మందిరానికి అష్టావక్రమహాముని రావడం జరిగింది. ముని కుతూహలంతో ఉపవాసానికి కారణం అడగగా, పూర్వ జన్మ జ్ఞానం కల్గిన చిత్రభానుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వజన్మమున చిత్రభానుడు, సుస్వరుడనే వేటగాడు. జంతు పక్ష్యాయదులను చంపి అమ్ముకొనే వృత్తి చేయువాడు. ఒక రోజు వేట చేస్తూ అడవిలో సంచరిస్తూండగా బాగా చీకటి పడిపోయింది. తను ఒక లేడిని చంపినా ఇంటికి తీసుకెళ్ళే విధానం ఆ చీకటిలో తోచలేదు. ఇక ఏమి చెయ్యలేక, ఆ రాత్రికి ఒక బిల్వ వృక్షముపై తలదాచుకున్నాడు. ఆకలి దప్పికలతో బాధించిన వాడై, రాత్రంతా మేలుకొనే ఉన్నాడు. తన భార్య బిడ్డలు తిండి లేక యెంత బాధపడుతున్నారో తలచుకొని రోదించాడు. రాత్రి నిద్ర పొతే ఎక్కడ జంతువుల పాలు పడే ప్రమాదం ఉన్నదోనని నిద్ర రాకుండడానికి బిల్వ పత్రాలను ఒకటి ఒకటి తుంచి చెట్టు కిందకు వేయడం మొదలుపెట్టాడు. తెల్లవారిన తర్వాత తను చంపిన జంతువుని అమ్మి, ఆహారమును కొనుక్కొని, ఇంటికి తెరిగి వెళ్ళాడు. తను ఆహారం తీసుకొనడానికి ఉపక్రమించిన సమయంలో ఇంటి బయట అన్నార్తుడై ఒక వ్యక్తి రాగా, దయ కలిగినవాడై, ముందు అతడికి ఇచ్చి తర్వాత తను తిన్నాడు.

ఆ వేటగాడు చనిపోవుకాలం ఆసన్నమైనప్పుడు, శివదూతలు అతడి ఆత్మను శివలోకానికి తోడుకొని పోయారు. అక్కడ అతడికి తను అడవిలో చిక్కుకొన్న రోజున చేసుకున్న పుణ్యం తెలిసి వచ్చింది. ఆ బిల్వ వృక్షం కింద ఒక లింగం ఉంది. ఆ వేటగాడు తన కన్నీరుతో స్వామికి తెలియకనే అభిషేకం చేసాడు. బిల్వపత్రాలను వదిలి పూజ చేసాడు. అన్నపానీయాలు లేక ఉపవాసం ఉన్నాడు. ఆ రాత్రి మహాశివ రాత్రి. మర్నాడు వేరొకరికి ఆహరం సమర్పించి తను సేవించాడు.

శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు – “మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . ఈ దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును. ఉపవాసము ఉండి, రాత్రి నాల్గుఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి. ఈ ఆచారాన్ని మించినది వేరొకటి లేదు!!”

ఈ రోజున స్వామిని జ్యోతిర్లింగరూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. నాల్గుఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున దీక్షను తీసుకుంటారు.

భారత దేశంలో 12 చోట్ల ద్వాదశ జ్యోతిర్లింగాలు వెలిసాయి. లింగం జ్యోతిరూపంలో వెలిసిన క్షేత్రాలివి.

రామనాథ ఆలయం, రామేశ్వరం, తమిళనాడు
మల్లికార్జునేశ్వర ఆలయం, కృష్ణా నది తీరంలో, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్
భీమశంకరం, డాకిని, పూణ దగ్గర, మహారాష్ట్ర
త్ర్యంబకేశ్వరాలయం, గోదావరి నదీ తీరంలో, నాసిక్ దగ్గర, మహారాష్ట్ర
గుస్మేశ్వర ఆలయం, ఔరంగాబాద్ దగ్గర, మహారాష్ట్ర
ఓంకారేశ్వరాలయం, నర్మదా నదీతీరంలో, అమలేశ్వర్, మధ్యప్రదేశ్
సోమనాథ్ ఆలయం, సోమనాథ్, గుజరాత్
నాగనాథ ఆలయం, దారుకావన, ద్వారక దగ్గర, గుజరాత్
మహాకాళేశ్వర ఆలయము, శిప్రా నదీ తీరంలో, ఉజ్జయిని
కేదరేశ్వరాలయం, కేదారనాథ్, ఉత్తరాచల్
కాశి విశ్వనాథుని ఆలయం, వారాణసి, ఉత్తరప్రదేశ్
వైద్యనాధుని ఆలయం, జైసిద్ దగ్గర, బీహార్
అథర్వణ వేద సంహితలో యుప స్తంభమునకు పూజించుతూ చేసే స్తుతిలో మొట్ట మొదటి సారిగా శివ లింగం చెప్పబడింది అంటారు. ఈ యుప స్తంభం/స్కంభం ఆద్యంతరహితమైనది. పరమాత్మ రూపమైనది. అట్టి లింగోద్భవం జరిగిన రోజు శివ రాత్రి.

స్కంద పురాణం ప్రకారం ౪ రకాల శివ రాత్రులు. ప్రతీ రోజు నిత్య శివరాత్రి. ప్రతీ నెల కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి, మాస శివరాత్రి. మాఘ మాసం లో ప్రథమ తిథి నుండి చతుర్దశి రాత్రి వరకు పూజలు చేసి, రాత్రి చేసేది మాఘ ప్రధమాది శివరాత్రి. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి చేసేది మహా శివరాత్రి..

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.