పితృకర్మలు కర్మలు ఎందుకు చేయాలి ?

వేదబోధిత కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి . నవమాసాలు కడుపులో పెట్టుకొని , రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి , పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణభారము వహించిన తండ్రికి క్రుతజ్ఞత చూపడము మానవత్వము.విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి .
శ్లోకం :

“దేవకార్యదపి సదా పితృకార్యం విశిష్యతే ”
దేవ కార్యాలు కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి. పితృకర్మలు, పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాలనిస్తారు అనగా దేవ కార్యాలను వదిలి వేయాలని చెప్పడం కాదు.

పితృకార్యాలు మాని ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా ఫలం లేదు పితృకార్యాలు చేసిన వారికే దేవ కార్యాలు ఫలిస్తాయి. అబీష్టసిద్దికి, వంశ వృద్దికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం.
మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కీర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం.అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని మన నమ్మకం.
మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి.

పితృ దోషం:
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే , లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యం గా సంతాన భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.
మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్థను అనాదరణ చేసిన ఎడల పునర్ జన్మలో వారి కుండలిలో పితృ దోషము కలుగును.సర్ప హత్య లేదా ఏదైనా నిరపరాధిని హత్య చేసినా కూడా పితృ దోషము కలుగును.
పితృ దోషమును నివారించుటకు నియమించ బడ్డ పితృ కార్యములు చేయవలెను పితృ పక్షములో శ్రార్దము చేయవలెను.నియమిత కాకులకు మరియు కుక్కలకు భోజనము పెట్టవలెను. వట వృక్షమునకు నీరు పోయవలెను. భ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. గోవును పూజించవలెను. విష్ణువును పూజించుట లాభదాయకము.

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.